తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వస్తూ ఐదుగురు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లి శివారులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.