నిలువ నీడ కరువైన భారీ బొజ్జగణపయ్య..! అవంచలో కొలువుదీరిన ఈ గణపయ్య దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం. భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15అడుగులు. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం పదకొండో శతాబ్దం నాటికి చెందిందని చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. అవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది. అయితే.. తైలంపుడు తల్లి అనారోగ్యం బారిన పడడంతో అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని స్థానికంగా ప్రచారంలో ఉంది.