65 ఏళ్ల వయసులో 40 జంటలు.. ఊరంతా కన్నుల పండుగలా జరిగిన వేడుక

భగవంతుడికి...భక్తుడికి అనుసంధానంగా ఉండే ఆ గ్రామ పురోహితుడికి (పూజారి) కి వచ్చిన ఆలోచన ఈ షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం రూపకల్పనకు దారితీసింది. కార్తిక మాసం సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ పురోహితుడు. గ్రామం పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని దీవించే ఆ పూజారి ఈ మహతర కార్యక్రమం నిర్వహించడంతో ఆయనను ప్రతి ఒక్కరు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆయన ఓ ఆలయ పూజారి 45 ఏళ్లుగా గ్రామంలో ఉంటూ నిత్యం రామాలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. అందరూ బాగుండాలి, పాడిపంటలతో గ్రామం కలకడలాడాలని కోరుకునే ఆ పూజారి గ్రామం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో 40 మంది వృద్ధ జంటలకు షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని తలచారు.