తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. రూ.1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఇక మెదక్ జిల్లాలో 399 కోట్లరూపాయలతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేశారు.