ఆటో డ్రైవర్లకు చంద్రబాబు దసరా కానుక..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుక ప్రకటించారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. ఈ పథకం "వాహనమిత్ర" పేరుతో దసరా రోజున అమలు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా, వారి వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించడంలో తోడ్పడుతుందన్నారు. వాహనాల నిర్వహణ, మరమ్మతులు, ఇతర ఖర్చులకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.