పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చిందంటే మక్కపేట, చిల్లకల్లు, జగ్గయ్యపేట, భీమవరం, లింగగూడెం గ్రామ ప్రజలకు, వారి బంధువుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక్కడ ఇంతకన్నా పెద్ద పండుగ మరొకటి లేదు. పురాతన కాలంలో చెక్కతో చేసిన విగ్రహాలు కావటంతో విగ్రహాలకు చిన్నచిన్న మరమ్మతులు అవసరమవుతాయి. దీంతో ప్రతి రెండేళ్లకు ఆలయంలోని 11 విగ్రహాలను జగ్గయ్యపేటలో రంగులు వేస్తారు. ఈ పనులు పూర్వ కాలం నుంచీ నకాసి వంశీయులు చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటిన రంగులకు బయలు దేరే విగ్రహాలు ఫిబ్రవరి 2 తెల్లవారు జామున జగ్గయ్యపేటకు చేరుతాయి. రంగుల అనంతరం ఫిబ్రవరి 18న తెల్లవారు జామున జగ్గయ్యపేటలో బయలు దేరతాయి. జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు, రాత్రికి వత్సవాయి మండలం భీమవరానికి విగ్రహాలు చేరుతాయి. అనంతరం ఫిబ్రవరి 19న భీమవరం నుంచి పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామానికి చేరుకుంటాయి.