5 గంటలపాటు వర్షంలో అధికారపార్టీ ఎమ్మెల్యే ధర్నా..! ఫోన్‌లో సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో దురుసుగా మాట్లాడారని, మీరు ఎమ్మెల్యే అయితే నాకేంటి.. మీరు చెబితే కేసులు నమోదు చేయాలా? అంటూ సీఐ లక్ష్మీ కాంత్ రెడ్డి దురుసుగా వ్యవహరించినట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపించారు. సీఐ దురుసు వ్యవహారశైలిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఓవైపు అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయకుండా, అడిగినందుకు ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడటంపై జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 5 గంటల పాటు వర్షంలో తడుస్తూనే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వీడియో కాల్‌లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, టీడీపీ నాయకులు ఆందోళన విరమించారు.