విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ లో హెడ్మాస్టర్ వీరంగం సృష్టించాడు. కుంటినవలస జడ్పీ హైస్కూల్ లో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణారావు గత కొన్ని నెలలుగా మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి స్కూల్ కి వస్తూ ఉండేవాడు. అంతేకాకుండా స్కూల్ ఆవరణలోనే తోటి ఉపాధ్యాయుడితో కలిసి మద్యం సేవిస్తుంటాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ అతన్ని అడిగే ధైర్యం చేసేవారు కాదు. కానీ రోజురోజుకి విషయం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18 ఉదయం హెడ్మాస్టర్ రామకృష్ణారావు మద్యం మత్తులో తూలుతూ పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులు క్లాస్‌లో కూర్చుని ఉండగానే గట్టి గట్టిగా అరుస్తూ, డెస్క్‌లు తన్నుతూ వీరంగం సృష్టించాడు. పిల్లలు, టీచర్స్ ను బూతులు తిడుతూ అందరినీ భయపెట్టాడు. తోటి ఉపాధ్యాయులు భయంతో వెనక్కి తగ్గారు. విషయం తెలుసుకున్న విద్యా కమిటీ చైర్మన్ సత్యనారాయణ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో డిప్యూటీ డిఈవో మోహన్ రావు స్కూల్ లో విచారణ చేపట్టారు.