పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వతో నిండు కుండలా మారింది. గుంటూరు - నల్గొండ జిల్లాల మధ్య ఉన్న ప్రాజెక్ట్ పై నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుంటాయి. భారీ వాహనాలకు అనుమతి లేదు గాని ద్విచక్ర వాహనాలు, స్థానికులు అటు ఇటు రాకపోకలు పులిచింతల ప్రాజెక్ట్ నుండే చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అనకోకుండా ఒక కారు ప్రాజెక్ట్ పైకి వచ్చింది. కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన కారు డ్రైవర్ నీటిలో ఉండాల్సిన మొసలి ప్రాజెక్ట్ పైకి వచ్చినట్లు గుర్తించాడు. అంతేకాకుండా తన సెల్ ఫోన్‌లో మొసలి కదలికలు రికార్డ్ చేశారు.