దక్షిణాది అయోధ్య భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నదీ ఒడ్డున.. మిథిలా స్టేడియంలో జానకీ రాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా తయారు చేశాడు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి.