కోతుల బెడద రైతులకు తప్పడం లేదు. ఎక్కడ చూసినా కోతులు.. అడవిలో ఉండాల్సిన కోతులు.. జనావాసాలు, రోడ్లు, పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి. రైతులకు అయితే పంట పొలాలను నాశనం చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏమి చేసినా వీటి బెడద తప్పడం లేదు. 'హేయ్ కోతుల్లారా ఇక్కడ అడుగుపెట్టి చూడండి. అదిరిద్ది మీకు..' అని కొండ ముచ్చుల ప్లెక్సీలతో ఏర్పాటు చేసిన ఈ రైతు ఆలోచన అందరికీ ఆదర్శంగా నిలిచింది. కోతులు దండయాత్ర చేయడంతో వాటికి చెక్ పెట్టేందుకు జీవంలేని కొండముచ్చుల ఫ్లెక్సీలను రంగంలోకి దింపారు భద్రాచలం ఏజెన్సీ రైతులు. పల్లెలు-పట్టణాలు తేడా లేకుండా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కూరగాయల తోటలు పెంచే రైతులు కోతులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కోతుల దాడులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడులలో గాయపడటంతో పాటు పంట నష్టం కూడా తప్పడం లేదు. కోతుల బాధ ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కొండముచ్చుల ఫ్లెక్సీలను పంటలకు రక్షణగా వాడుతున్నారు.