మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుండి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని రేపనపల్లి వద్ద కొలమరక అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఉమ్మడి ఆదిలాబాద్లో కీలక బాధ్యతల్లో ఉన్న కుమురంభీం-మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు, మంగి - ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్ , సిర్పూర్-చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మక్తు, మావోయిస్టు మిలటరీ ప్లటూన్ సభ్యులు కుర్సెంగ రాజు, మెట్ట వెంకటేష్ లు హతమవడంతో మంగీ అభయారణ్యం, ప్రాణహిత సరిహద్దు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు జిల్లా పోలీసులు.